- పెండింగ్ బకాయిదారులపై చర్యలకు సిద్ధం
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మినహా మిగతా 123 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి మంగళవారంనాటికి 56 శాతం కూడా పన్నులు వసూలు కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికి ఈ మున్సిపాలిటీల నుంచి 1,180.47 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. రూ.700 కోట్లలోపే వసూలయ్యాయి. చాలా మున్సిపాలిటీల్లో భారీగా పన్నులు పేరుకుపోయాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు అధ్వానంగా ఉన్నాయి.
చివరి రోజు కూడా ఆశించినంతగా వసూళ్లను రాబట్టలేపోయారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందుకు తోడైనట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను బట్టే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల కానున్నాయి. దీంతో పెండింగ్ బకాయిదారులపై చర్యలు తీసుకుంటారా ? ఎప్పటిలాగే వదిలేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
జమ్మికుంట, హుజురాబాద్ లో 100 శాతం వసూళ్లు..
వంద శాతం పన్ను వసూళ్లతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ ముందు వరుసలో ఉండగా.. కోరుట్ల, చేవెళ్ల, సిరిసిల్ల మున్సిపాలిటీలు 90 శాతం దాటాయి. జమ్మికుంటలో రూ.3.24 కోట్ల లక్ష్యాన్ని 16 రోజుల ముందే బల్దియా సిబ్బంది చేరుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ లో రూ.2.81 కోట్ల లక్ష్యాన్ని నాలుగు రోజుల ముందే రీచ్ అయ్యారు. గత రెండేళ్లుగా ఈ రెండు మున్సిపాలిటీలే పన్ను వసూళ్లలో రాష్ట్రంలో టాప్ లో నిలవడం విశేషం. ఆ తర్వాత జగిత్యాల జిల్లా జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో రూ.5.70 కోట్లకుగాను రూ.5.23 కోట్లు(93.39 శాతం), రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రూ.3.07 కోట్లకు గాను రూ.2.79 కోట్లు(92 శాతం), సిరిసిల్లలో రూ.6.88 కోట్లకు రూ.6.27 కోట్లు(91.29 శాతం) వసూలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో 88 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ లో 87 శాతం, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 86 శాతం, మెట్ పల్లి, సిద్ధిపేట, వికారాబాద్, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో 85 శాతం పన్నులు వసూలయ్యాయి.
కార్పొరేషన్లలో రామగుండం టాప్..
రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 75 శాతం వసూళ్లతో ముందు వరుసలో ఉంది. రామగుండంలో 51,036 అసెస్ మెంట్స్ ఉండగా.. వాటి నుంచి రూ.18.95 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.14.18 కోట్లు వసూలు కాగా, రూ.4.77 కోట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 1,02,157 అసెస్ మెంట్ల నుంచి రూ.66.70 కోట్లు రావాల్సి ఉండగా.. 46.59 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
ఇంకా రూ.20.11 కోట్లు ట్యాక్స్ పెండింగ్ లో ఉంది. ఈ 20 కోట్లలో రూ.కోటి వరకు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో నిర్వహించే రెవెన్యూ క్లబ్, షాపింగ్ కాంప్లెక్స్ ల బకాయిలు ఉండగా.. రూ.90 లక్షలకుపైగా టీఎన్జీవోస్ కమర్షియల్ బిల్డింగ్, ఫంక్షన్ హాల్ బకాయిలు ఉన్నాయి. గత ఏడాది రూ.87 లక్షల బకాయి ఉందంటూ రెవెన్యూ క్లబ్ ను సీజ్ చేసిన బల్దియా ఆఫీసర్లు ఆ తర్వాత.. ట్యాక్స్ కట్టకపోయినా తొలగించారు. ఈసారి నోటీసులు ఇచ్చి వదిలేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 56 శాతం, మంచిర్యాలలో 53 శాతం, ఖమ్మంలో 52 శాతం, నిజామాబాద్ లో 43 శాతం, మహబూబ్ నగర్ లో 42 శాతం, నల్లగొండలో 36 శాతం ట్యాక్స్ వసూలైంది.
సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల వెనుకబాటు..
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 6.02 కోట్లకుగాను కేవలం 1.53 కోట్లు(25.50) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా నాలుగున్నర కోట్లు వసూలు కావాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 23.42 కోట్లు రావాల్సి ఉండగా.. 6.56 కోట్లు(28 శాతం), సదాశివపేటలో 12.37 కోట్లకు రూ.3.65 కోట్లు(29.60 శాతం), కోహిర్ లో రూ.20 లక్షలకు రూ.8 లక్షలు(40 శాతం) మాత్రమే వసూలయ్యాయి. నిర్మల్ జిల్లా బైంసాలో రూ.5.58 కోట్లకు రూ.1.81 కోట్లు(32.50) వచ్చాయి.
